రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ధాన్యం కొనుగోలు
కేంద్రంలో తనిఖీ
సుజాతనగర్ : సుజాతనగర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తేమ శాతం పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఆరబెట్టుకున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. రైతులకు అందిస్తున్న గోనె సంచులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, ఏఈఓ ప్రనూష పాల్గొన్నారు.
భవన నిర్మాణాల్లో
వేగం పెంచాలి
ములకలపల్లి : భవిత పాఠశాలల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కస్తూర్బా విద్యాలయం, రాజుపేట ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వివిధ తరగతుల విదార్థులతో మాట్లాడి, వారి సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో..
ములకలపల్లి జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ సురేష్‌బాబు, జీపీ కార్యదర్శి రవి ఉన్నారు.
క్రీడా సామగ్రి అందజేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని వికాసం పాఠశాల బాల బాలికలకు క్రీడా సామగ్రి పంపిణీ చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వికాసం పాఠశాల పిల్లలతో పీఓ దంపతులు సరదాగా గడిపారు. అనంతరం సుమారు రూ.60 వేల విలువైన టేబుల్ టెన్నిస్ సెట్, చెస్, క్యారం బోర్డ్, టెన్నికాయిట్ ఆట వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణకుమారి, ప్రియాంక, కృష్ణవేణి, అరుణ పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన


