మలిదశలో 16 ఏకగ్రీవం
చుంచుపల్లి: రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు, వార్డుల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి నిమిషంలో బుజ్జగింపులు, బేరసారాలు జోరుగా సాగడంతో నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 155 గ్రామపంచాయతీలు, 1,384 వార్డులకు ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరగనుండగా ములకలపల్లి మండలం చాపరాలపల్లి పంచాయతీకి హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 16 గ్రామ పంచాయతీలతో పాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడతలో 14 జీపీలు, 336 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఆదివారం నుంచి ప్రచార బాట పట్టనున్నారు.
మండలాల వారీగా వివరాలిలా..
●చుంచుపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీ లకు గానూ విద్యానగర్ కాలనీ ఏకగ్రీవమైంది. మిగతా 17జీపీలకు 55మంది సర్పంచ్ అభ్యర్థులు బరి లో నిలిచారు. 168 వార్డులకు 9 ఏకగ్రీవం కాగా, 159 వార్డులకు 420మంది పోటీలో మిగిలారు.
●చుండ్రుగొండ మండలంలో 14 పంచాయతీల్లో మంగయ్యబంజర, బెండాలపాడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 134 వార్డులకు 26 ఏకగ్రీవం కాగా, మిగిలిన 108 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానాల బరిలో 33 మంది, వార్డులకు 237 మంది పోటీలో ఉన్నారు.
●అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీల్లో ఊటపల్లి, గుంపెన సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం ఆయ్యాయి. మిగిలిన 8 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 98 వార్డులకు 19 ఏకగ్రీవం కాగా, 79 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
●పాల్వంచ మండలంలో 36 పంచాయతీల్లో సంగం, తవిశలగూడెం, ఇల్లెందులపాడు తండా, బిక్కుతండా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 32 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. 282 వార్డులకు 62 ఏకగ్రీవం అయ్యాయి. 208 వార్డులకు బరిలో 491 మంది బరిలో ఉన్నారు. 12 వార్డులకు రిజరేషన్ అభ్యర్థులు లేక నామినేషన్లు దాఖలు కాలేదు.
●అశ్వారావుపేట మండలంలో 27కు గాను మద్ది కొండ, రామన్నగూడెం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 25 జీపీల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. 234 వార్డులకు 37 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 197 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
●దమ్మపేట మండలంలో మొద్దులగూడెం, తాటిసుబ్బన్నగూడెం, అల్లిపల్లి, పూసుకుంట గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, 27 జీపీల్లో ఎన్నికలు జరుగుతాయి. 290 వార్డులకు 56 ఏకగ్రీవం కాగా, 234 స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు.
●ములకలపల్లి మండలంలో 20 సర్పంచ్ స్థానాలకు గాను పొగళ్లపల్లి ఏకగ్రీవం కాగా, చాపరాలపల్లిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 18 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 178 వార్డులకు 34 ఏకగ్రీవం కాగా, 144 చోట్ల ఎన్నికలు జరుగుతాయి.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ


