గద్దర్‌తో బాలసుబ్రహ్మణ్యంకు పోటీ అనవసరం
ఇల్లెందు: పీడిత ప్రజల కోసం తుది వరకు పోరాడిన గద్దర్ ఆశయ సాధనకు తాను నడుం బిగించానని ఆయన కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల తెలిపారు. ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు సందర్భంగా గద్దర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోందని చెప్పారు. కానీ గద్దర్ – బాలసుబ్రహ్మణ్యం మధ్య పోటీ అనవసరమని తెలిపారు. కాగా, గద్దర్ త్యాగాలు, జీవితాంతం ప్రజల కోసం పోరాడిన తీరు, ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా ఆయనపై ప్రజల్లో అభిమానం ఉండగా, తనకు సైతం ఆదరణ లభిస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలోని 524 మంది సభ్యులకు గతంలో ఆరు నెలలకోసారి వేతనాలు అందేవని.. తాను బాధ్యతలు తీసుకున్నాక సమస్య తీర్చానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందుతున్న ప్రజలు గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని వెన్నెల కోరారు. ఈ సమావేశంలో నాయకులు గోచికొండ శ్రీదేవి, మడుగు సాంబమూర్తి, గోచికొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల


