తుమ్మల స్వగ్రామంలో ఫలించని ఏకగ్రీవం
దమ్మపేట : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారుడికి సర్పంచ్, కాంగ్రెస్ మద్దతుదారుడికి ఉప సర్పంచ్ పదవులతో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి కూడా ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా పోటీ తప్పడం లేదు. 1800 మంది ఓటర్లున్న ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అంది. సర్పంచ్ స్థానానికి మొదట ఆరుగురు నామినేషన్లు దాఖలుచేయగా శనివారం నాటికి నలుగురు ఉపసంహరించుకున్నారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారుడు మెచ్చు ఈదప్ప, బీఆర్‌ఎస్ బలపర్చిన పండు సాంబశివరావు బరిలో ఉన్నారు. మొత్తం 10 వార్డులకు గాను 20 మంది నామినేషన్ దాఖలు చేయగా రెండో వార్డు ఏకగ్రీవం కావడంతో 9 వార్డులకు 18 మంది పోటీలో నిలిచారు.


