భద్రగిరి పీఠం ఎవరిదో?
సర్పంచ్ బరిలో 8 మంది..
● టీడీపీ కూటమి బలపర్చిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ ● అధికారులకు అప్పీల్.. నేడు నిర్ణయం
భద్రాచలం: తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాచలంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. సర్పంచ్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు ఆయా పార్టీల మద్దతుతో నామినేషన్లు వేశారు. పరిశీలన ప్రక్రియ ఆదివారం ముగియగా నిబంధనలు పాటించని వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఎనమిదేళ్లుగా ఆశలు..
సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మద్దతుతో భారీ కోలాహలం, ర్యాలీల నడుమ వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన హరిశ్చంద్రనాయక్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు అఽధికారులు ప్రకటించారు. దరఖాస్తులో నింపాల్సిన వివరాలను అదనంగా జత చేసిన పేపర్‌పై రాయడంతో ఇతర పార్టీల వారు అభ్యంతరం తెలపగా, స్క్రూట్నీలో ఆయన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సర్పంచ్ పీఠంపై ఎనమిదేళ్లుగా ఆయన పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా, తన అనుచరగణంతో సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్‌ను కలిసిని హరిశ్చంద్రనాయక్.. జాబితా పెద్దగా ఉన్నందున ఆ పేజీలో నింపకుండా అటాచ్ చేసినట్లు చెప్పారని సమాచారం. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు మంగళవారం నిర్ణయం వెల్లడిస్తానని సబ్‌కలెక్టర్ తెలిపారు. ఇక కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న పూనెం కృష్ణపై సైతం పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సర్పంచ్ బరిలో మానె రామకృష్ణ, పూనెం కృష్ణ, ధారావత్ తులసీపవన్, భూక్యా శ్వేత, పూనెం అనంతమ్మ, మానె లావణ్య, పూనెం ప్రదీప్‌కుమార్, రేగా సందీప్ ఉన్నారు. వీరిలో బీఆర్‌ఎస్, సీపీఎం, గోండ్వాన పార్టీ కూటమి అభ్యర్థిగా మానె రామకృష్ణ ఉండగా, కాంగ్రెస్ రెబల్‌గా భూక్యా శ్వేత ఉన్నారు. తొలుత శ్వేత బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మద్దతుతో పోటీ చేయాలని భావించగా చివరి నిమిషంలో హరిశ్చంద్రనాయక్ తెరపైకి వచ్చారు. దీంతో ఆమె కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. హరిశ్చంద్రనాయక్ నామినేషన్ తిరస్కరణకు గురైతే శ్వేత కూటమి మద్దతు కూడగట్టే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.


