ఎర్త్ సైన్సెస్.. నేడు జాతికి అంకితం
● యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా అధికారులు ● యూనివర్సిటీ ఆవరణలోనే బహిరంగ సభ
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. యూనివర్సిటీలో తరగతి గదులు, హాస్టల్ భవనాలకు రంగులు వేయగా నూతన శోభ సంతరించుకుంది. ప్రారంభోత్సవం అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలోనే బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ రోహిత్‌రాజ్ ఆధ్వర్యంలో 900 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుని 2.40 గంటల వరకు ప్రారంభోత్సవ వేడుకలో, ఆ తర్వాత 2.45 గంటల నుంచి 3.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
రాష్ట్రంలో తొలి ‘విశ్వవిద్యాలయం’..
రాష్ట్రంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని జిల్లాలో ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రాక సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొత్తగూడెం ప్రాంతంలో విస్తారంగా బొగ్గు గనులు, ఖనిజ వనరులు ఉన్నాయని, ఈ విశిష్టతల నేపథ్యంలోనే గతంలో ఇక్కడ స్థాపించిన మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీని ఆధునిక భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చామని, రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఇక్కడ జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ వంటి కీలక విభాగాలతో కూడిన ప్రత్యేక కోర్సులు ఏర్పాటవుతాయని వెల్లడించారు. జిల్లాలో ఈ విశ్వవిద్యాలయం స్థాపన తెలంగాణ విద్యా రంగంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు.


