దేశంలోనే అత్యధిక ఓఈఆర్
● ఫెర్టిలైజర్ డీలర్‌షిప్ తీసుకుంటాం ● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వెల్లడి ● ఫ్యాక్టరీ మేనేజర్లకు ఘన సన్మానం
దమ్మపేట: 2024 – 25 సంవత్సరానికి రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ సంస్థ దేశంలోనే అత్యధిక ఓఈఆర్(ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్) 20.01 శాతం సాధించడం గర్వంగా ఉందని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. అత్యధిక ఓఈఆర్ సాధించిన సందర్భంగా మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మేనేజర్లను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆయిల్ సంవత్సరంలో 3.3 లక్షల టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్‌నకు మేనేజర్లు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని అభినందించారు. అత్యధిక ఓఈఆర్‌తో టన్ను గెలలకు అదనంగా రూ.500 పెరగనుందని తెలిపారు. పామాయిల్ రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో అత్యాధునిక టెక్నాలజీతో నూతన ఫ్యాక్టరీని నిర్మించామని తెలిపారు. అత్యధిక ఓఈఆర్ వచ్చేందుకు ప్రతీ ఫ్యాక్టరీలో ఆధునిక సాంకేతిక యంత్రాల వినియోగానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్‌షిప్‌ను ప్రముఖ బహుళ జాతి కంపెనీల నుంచి తీసుకునేలా త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో చర్చిస్తామని వివరించారు. తద్వారా సంస్థకు లాభంతో పాటు రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందించే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైతే పామాయిల్ రైతులకు ఎరువులు అప్పుగా ఇచ్చి, ఫ్యాక్టరీకి గెలలు తీసుకొచ్చాక అందులో మినహాయించుకుంటామని తెలిపారు. ఆయిల్‌పామ్ నర్సరీల పెంపకంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతామన్నారు. నర్సరీలో మొక్కల పెంపకం నుంచి రైతులు సాగు చేసే తోటల పరిశీలనకు ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మేనేజర్లు కళ్యాణ్ గౌడ్, నాగబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, చలసాని సాంబశివరావు, బండి భాస్కర్, మద్దినేని వెంకట్, కోటగిరి సీతారామస్వామి, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, కె.వి.రాధాకృష్ణ, మొగళ్లపు చెన్నకేశవరావు, సత్యనారాయణ చౌదరి, వసంతరావు, అప్పారావు, అంకత మహేశ్వరరావు పాల్గొన్నారు.


