రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవంగా సత్యనారాయణ వ్రతం..
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చిత్రకూట మండపంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాల్లో ఈ వ్రతాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొని, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
కాగా, రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో సుమారు 1.40 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈ ఏడాది 1.80 లక్షల మంది దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌లో నిరంతరం వర్షాలు కురిసినా భక్తుల రాక పెరగడం విశేషం.
భక్తి శ్రద్దలతో ‘కార్తీక’ వ్రతం


