వ్యాపార విస్తరణ చర్యలు భేష్
కొత్తగూడెంఅర్బన్ : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టడం హర్షణీయమని మాజీ డైరెక్టర్(పా) జి.ఎస్.జి. అయ్యం అన్నారు. సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 27 నుంచి ఈనెల 2వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో తాను పనిచేసిన కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. సంస్థ చేసే కొనుగోళ్లు, టెండర్ల విషయంలో స్పష్టత ఉండాలని, అవసరం మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. తద్వారా సంస్థకు నష్టం రాకుండా ఉంటుందని తెలిపారు. 2003 నుంచి ఇప్పటివరకు సింగరేణి సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకలు ఘననీయంగా వృద్ధి చెందాయని, తెలంగాణలోనే కాకుండా ఒడిశాలోనూ బొగ్గు ఉత్పత్తి చేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చెంది గ్లోబల్ సంస్థగా మారాలని ఆకాంక్షించారు. కాగా, సీఎండీ ఎన్.బలరామ్ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రంలో బొగ్గు బ్లాక్‌ను ప్రారంభించామని, రాజస్థాన్‌తో కలిసి సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ జరుగుతోందని, బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణి గ్రీన్ ఎనర్జీ సంస్థగాను, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్‌గాను విస్తరించనుందని తెలిపారు. అనంతరం మాజీ డైరెక్టర్(పా) అయ్యం ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు పాల్గొన్నారు.


