ములకలపల్లి/ చుంచుపల్లి : గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి బి.అనూష సిబ్బందిని ఆదేశించారు. ‘పల్లె పాలన.. పడేనా గాడిన’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పర్యటించిన డీపీఓ.. పంచాయతీలో పలు రిజిస్టర్లతో పాటు పారిశుద్ధ్య పనులు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, నర్సరీ నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని, గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఎస్‌కే షబ్న, కార్యదర్శి పఠాన్ యూనిస్ ఖాన్, గుంటుపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె పాలనపై డీపీఓ దృష్టి
రికార్డులు పక్కాగా నిర్వహించాలి


