15న ప్రత్యేక లోక్ అదాలత్
కొత్తగూడెంటౌన్: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం పాటిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజీ పడదగిన కేసుల్లో ఇరు వర్గాల నిర్ణయాలతో ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునేలా కృషి చేయాలని అన్నారు. చిన్న విషయాల్లో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీపడడమే ఉత్తమమని కక్షిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
కేసుల పురోగతిని పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే తమ దృష్టికి తేవాలని అన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్‌కుమార్, రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


