ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
కొత్తగూడెంటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణం మేదరబస్తీకి చెందిన ములుగురి శ్రీనివాస్, లక్ష్మి(32) దంపతులు చుంచుపల్లి విద్యానగర్ కాలనీలో దుకాణం ఏర్పాటు చేసుకుని బుట్టలు వంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. శనివారం దుకాణానికి బైక్‌పై బయల్దేరారు. అదే సమయంలో కొత్తగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో పోస్టాఫీస్ సెంటర్‌లోని పెట్రోల్ బంకు వద్ద బస్సు ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కిందపడిపోయారు. లక్ష్మి మీదుగా ఆర్టీసీ టైరు వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా భార్య మృతదేహం వద్ద భర్త రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
రోడ్డు ప్రమాదంలో..
సత్తుపల్లి(పెనుబల్లి): మండలంలోని లంకపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన గుర్రం వెంకటదాసు – సంపూర్ణ(45) దంపతులు శనివారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వీ.ఎం.బంజరు మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో లంకపల్లి వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ కింద పడిన సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటదాసుకు గాయాలయ్యాయి. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సై వెంకటేష్ ఘటనాస్థలిని పరిశీలించి మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం దర్భగూడేనికి చెందిన అన్నమనేని శ్రీను(52) కొంతకాలంగా అశ్వారావుపేటలోని ఓ కూరగాయల దుకాణంలో దినసరి కూలిగా పని చేస్తున్నాడు. గడిచిన కొన్నేళ్లుగా మద్యానికి బానిసై కుటుంబీకులను పట్టించుకోవడంతో భార్య వాణితో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మద్యం తాగి మనస్తాపం చెంది గురై కూరగాయల దుకాణం యజమాని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి..
ఇల్లెందు: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మారేపల్లి వెంకటనారాయణ(56) శనివారం తన నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన అతని భార్య కొంతకాలంగా ఖమ్మంలోని కుమార్తె వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకటనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు శ్యామ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హసీనా కేసు నమోదు చేశారు.
దాడి ఘటనలో కేసు నమోదు
పాల్వంచ: పాత కక్షల నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తులపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 30న ప్రభుత్వాస్పత్రి రోడ్‌లో ఉన్న ఈర్ల గాంధీపై బత్తుల అంజి, అతని అనుచరులు కలిసి దాడి చేశారు. దీంతో తల పగిలి గాయమైంది. గాంధీ భార్య మహాలక్ష్మి ఫిర్యాదుతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి


