అదుపు తప్పి ఆటో బోల్తా
జూలూరుపాడు: అదుపు తప్పి ఆటో బోల్తా పడి ఏడుగురు గాయపడ్డ సంఘటన జూలూరుపాడులో శనివారం జరిగింది. కొమ్ముగూడెం, భేతాళపాడు, మాచినేనిపేటతండా, సాయిరాంతండాకు చెందిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గిద్దలగూడేనికి చెందిన బానోత్ సేవాలాల్ ఆటోలో మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలకు వస్తున్నారు. ఆటో ముందు జూలూరుపాడుకు చెందిన యువకుడు దూపాటి నరసింహారాజు బైక్‌పై వెళ్తున్నాడు. జూలూరుపాడు సెయింట్ ఆంటోనియస్ స్కూల్ సమీపంలోకి రాగానే కోతులు అడ్డు రావడంతో నరసింహారాజు సడన్ బ్రేక్ వేశాడు. వెనకాలే వస్తున్న ఆటో బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలోని ఆరుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనదారుడు నరసింహారాజుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులు లకావత్ స్నేహలత, బానోత్ నిఖిత, పాలేపు శరణ్య, గోగుల భవ్య, తేజావత్ భార్గవి, భూక్యా అవని, నరసింహారాజులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిత, స్నేహలత, శరణ్యలను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
ఏడుగురికి గాయాలు


