‘అర్బన్’లో సందిగ్ధం!
పట్టణ ప్రాంతాలకు ఎలా?
అందులో రూ. 60 వేలు ‘ఉపాధి’ ద్వారా అందజేత గ్రామీణ ప్రాంతాలకే ఉపాధి హామీ పథకం పరిమితం పట్టణ ప్రాంత లబ్ధిదారులకు ఈసాయం అందేనా ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 18,530 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు గడిచిన నాలుగైదు నెలలుగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో నిర్మించుకునే ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తోంది. పునాది నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ. లక్ష, శ్లాబ్ దశలో రూ. రెండు లక్షలు, ఫినిషింగ్‌లో మరో రూ.లక్ష లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ గ్రాంటులను ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది.
‘శ్లాబ్’ సాయం అందుతోంది
జిల్లా వ్యాప్తంగా నాలుగైదు నెలలుగా ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల నిర్మాణ పనులు కీలకమైన శ్లాబ్ దశకు చేరుకున్నాయి. ఈ మేరకు రూ.2 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాలో పడాల్సి ఉంది. ప్రభుత్వం అందించే రెండు లక్షల రూపాయల్లో రూ.60 వేలను ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పనులు అమల్లో లేనందున ఆ మేరకు సాయాన్ని మినహాయించి రూ.1.40 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కొన్ని రోజులుగా జమ అవుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద అందే రూ.60 వేల సాయం తమకు అందుతుందా లేదా అనే సందేహం ఇప్పుడు పట్టణ ప్రాంత లబ్ధిదారుల్లో నెలకొంది.
భారం పెరుగుతోంది
ప్రస్తుతం మార్కెట్‌లో సిమెంటు, ఐరన్, ఇసుక రేట్లు పెరిగాయి. కూలీలకు ఫుల్ డిమాండ్ ఉంది. పనిలోకి రప్పించాలంటే అధికంగా కూలి ఇవ్వాల్సి వస్తోంది. దీని వల్ల ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం కష్టంగా ఉంది. నూటికి తొంభై శాతం మంది లబ్ధిదారులు అదనంగా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కోసం ఇప్పటికే వారు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం అందించే సాయంలో ‘ఉపాధి’కి సంబంధించిన రూ.60 వేలకు కూడా కోత పడితే తమపై మరింత భారం మోపై అప్పుల ఊబిలో కూరుకుపోతామనే భయం పట్టణ ప్రాంత లబ్ధిదారుల్లో నెలకొంది. ఈ విషయంపై ఇందిరమ్మ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌ను వివరణ కోరగా.. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డ్ లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా ఉపాధి హామీ ద్వారా రూ.60 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు కూడా ఈ సాయం అందించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు పైనుంచి రావాల్సి ఉందని వివరించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ప్రతీ ఏడాది 100 రోజుల పని దినాలను ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కల్పించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో ఉపాధి హామీ పథకం భాగంగా చేయడంతో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలకు సంబంధించి జాబ్‌కార్డులు ప్రత్యేకంగా మంజూరు చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నారు. పట్టణ/మున్సిపాలిటీ ప్రాంతాల్లో నివసించే పేదలు ఈ పథకం పరిధిలోకి రారు. ఇందిరమ్మ ఇళ్లకు సాయంగా అందించే రూ.5 లక్షల్లో రూ.60 వేలను ఉపాధి హామీ ద్వారా సమకూర్చుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రూ.5 లక్షల సాయం పూర్తిగా అందుతుందా లేక ‘ఉపాధి’ ద్వారా వచ్చే రూ.60 వేలు మినహాయిస్తారా? అనే సందేహాలు పట్టణ ప్రాంత ఇందిరమ్మ లబ్ధిదారుల్లో నెలకొన్నాయి.
మున్సిపాలిటీలు ఇందిరమ్మ పురోగతి
లబ్ధిదారులు
మణుగూరు 344 12.40 శాతం
అశ్వారావుపేట 136 91.18 శాతం
పాల్వంచ 291 –––
కొత్తగూడెం 366 –––
ఇల్లెందు 357 93 శాతం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షల సాయం


