రెండు రోజులుగా నీళ్లు బంద్
● ఆందోళన చేపట్టిన ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ● అల్పాహారం తినకుండా స్కూల్‌లోనే నిరసన
ములకలపల్లి: రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తరగతులను బహిష్కరించి, క్యాంపస్ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని మూకమామిడిలో శివారులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్) పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఇక్కడ 225 మంది బాలురు, 210 మంది బాలికలు, మొత్తం 435 మంది విద్యార్థులు ఉన్నారు. వందమంది వరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వారి కుటుంబీకులు ఉంటున్నారు. మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో రెండు రోజులుగా పాఠశాల, హాస్టల్ భవనాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గతంలో పలుమార్లు ఇదే సమస్య ఏర్పడినా, తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు. దీంతో శాశ్వత పరిష్కారం చూపాలంటూ పిల్లలు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా స్నానం చేయలేదని, ఉదయం బ్రెష్ చేసుకునేందుకు కూడా నీళ్లు లేవని వాపోయారు. అల్పాహారం తినకుండా నిరసన చేపట్టడంతో ఆర్‌సీఓ అరుణకుమారి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ససేమిరా అనడంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి విద్యుత్ సమస్యను పరిష్కరించారు. కాగా విద్యార్థులు ఉదయం 7 గంటలకు తినాల్సిన టిఫిన్ 11 గంటలకు తిన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్కా అజిత్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అనుమల సాయి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
–ఎమ్మెల్యే ఆదినారాయణ
ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 మంది టీచర్లు ఉండి కూడా సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీఓ అరుణకుమారి, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వరప్రసాద్, జీపీ కార్యదర్శి శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, సురభి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజులుగా నీళ్లు బంద్


