రైతుకు శ్రమ తగ్గేలా.. | - | Sakshi
Sakshi News home page

రైతుకు శ్రమ తగ్గేలా..

Nov 1 2025 7:40 AM | Updated on Nov 1 2025 7:40 AM

రైతుకు శ్రమ తగ్గేలా..

రైతుకు శ్రమ తగ్గేలా..

యంత్రాలను కొనుగోలు చేసిన నాలుగు మార్కెట్‌ కమిటీలు

అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్న అన్నదాతలు

బూర్గంపాడు: విక్రయానికి ముందు ధాన్యం ఆరబెట్టేందుకు సరైన వసతులు, కల్లాలు లేక రైతులు ప్రతీ సీజన్‌లో అవస్థ పడుతున్నారు. హార్వెస్టర్లతో వరిపంట కోశాక పరదాలపై వడ్లు ఆరబోస్తున్నారు. ఆ సమయంలో అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఇలాంటి ఘటనలు ప్రతీ సీజన్‌లో ఎదురవుతూనే ఉన్నాయి. ఆరబెట్టేందుకు కూలీల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయ్యర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

ఒక్కో యంత్రానికి రూ. 17 లక్షలు

జిల్లాలోని బూర్గంపాడు, కొత్తగూడెం, దమ్మపేట, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నాలుగు ప్యాడీ డ్రయ్యర్‌ యంత్రాలను కొనుగోలు చేశాయి. మార్కెట్‌ కమిటీ ఆవరణలలో నిర్వహించే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యంత్రానికి రూ. 17లక్షల వరకు వెచ్చించారు. దీనిద్వారా గంటకు 30 టన్నుల వరకు ధాన్యాన్ని ఆరబెట్టే వీలుంది. ఇందుకోసం సుమారు 12 లీటర్ల వరకు డీజిల్‌ పడుతుంది. రైతులు డీజిల్‌ ఖర్చు భరిస్తే ప్యాడీ డ్రయ్యర్‌తో ఉచితంగా ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ధాన్యం పరదాలపై ఆరబోసుకుని రోజూ కూలీలతో ఆరతిప్పేందుకు అయ్యే ఖర్చులో డీజిల్‌ ఖర్చు పదోవంతు కూడా ఉండదు. దీంతోపాటు సమయం కూడా కలిసివస్తుంది. అకాల వర్షాలతో పంట నష్టపోయే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. రైతులు వరి కోయగానే ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చి ప్యాడీ డ్రయ్యర్‌లో పోస్తే గంటల వ్యవధిలోనే తేమశాతం తగ్గుతుంది. దీంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాలు

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం 193 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కొనుగోళ్లకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. గన్నీ బ్యాగులు, ఎలక్ట్రికల్‌ వేయింగ్‌ మిషన్లు, మాయిశ్చర్‌ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సామగ్రిని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు మొదలవుతున్నాయి. మరో వారం పదిరోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాగా 16 శాతం కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్నే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు.

అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం ప్యాడీ డ్రయ్యర్లను అందుబాటులోకి తెస్తున్నా సరిపడా లేకపోవటం కూడా ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. జిల్లాలో నాలుగు మార్కెట్‌ యార్డుల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లోని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులంతా ఇవే కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ డ్రయ్యర్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

ధాన్యం ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయ్యర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement