దేశ ఐక్యతలో పటేల్ కృషి ఎనలేనిది
కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
కొత్తగూడెంటౌన్: దేశ సమగ్రత, ఐక్యతలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎనలేనిదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. శుక్రవారం పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఫోస్టాఫీస్ సెంటర్ వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలు ఐక్యమత్యంతో జీవించేలా పటేల్ కృషి చేశారని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని దేశ సమగ్రతకు కృషి చేయాలని సూచించారు. రామవరం టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫోర్ ఇంక్లైన్ నుంచి రుద్రంపూర్ ప్రగతివనం పార్కు వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు నరేందర్, వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్దుల్ రెహమాన్, మల్లయ్యస్వామి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
యువత ముందుకు సాగాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటేల్ 150 జయంతి సందర్భంగా యువతలో ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతా భావనలను పెంపొందించేందుకు పాదయాత్రల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై ప్రసంగాలు, ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞలు, సర్టిఫికెట్ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే యువత https:// mybharat. gov. in/ pages/ unity& march వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విత్తన సేకరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు 40 రకాలైన 400 కిలోల విత్తనాలను సేకరించడం అభినందనీయమని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫర్నిచర్ తయారీలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఆసక్తిగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం ఐక్యతా ర్యాలీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


