స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామయ్య సేవలో ఆదాయపన్నుశాఖ కమిషనర్
భద్రాచలంటౌన్/దుమ్ముగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలను ఇన్‌కమ్‌టాక్స్ ప్రిన్సిపాల్ కమిషనర్ ప్రభాత్‌కుమార్ గుప్తా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాచలం అంతరాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికా రులు స్వామివారి శాలువాతో సత్కరించి ప్రసా దం, జ్ఞాపికను అందజేశారు. పర్ణశాలలో కూడా పూజలు చేశారు. అనంతరం పంచవటి కుటీరం, నార చీరల ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ పీఆర్‌ఓ సాయిబాబు పాల్గొన్నారు.


