పల్లె పాలన... పడేనా గాడిన?
పల్లె ప్రకృతి వనాలపై పట్టింపేది
● పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తం ● క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ ● ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాహ్నం ● డీపీఓ అనూషకు సమస్యల స్వాగతం
చుంచుపల్లి: పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గ్రామాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. దీంతో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సైడు కాలువలు, పైపులైన్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం అధ్వానంగా మారాయి. ఏడాదిన్నరగా పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై మరింతగా పనిభారం పెరిగింది. కనీసం వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, జీపీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేకపోతున్నారు. ఇప్పటి దాకా తమ జేబుల్లో నుంచి ఖర్చు చేసిన కార్యదర్శులు ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్వహణ దెబ్బతిన్నది. కొన్ని పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వలేదు. ఇటీవల జిల్లావ్యాప్తంగా 42 మంది పంచాయతీ కార్యదర్శులు జూలైలో ఫేక్ అటెండెన్స్‌తో దొరికిపోయారు. వీరందరికీ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. పలు మండలాల్లో ఎంపీఓల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారిగా తొలిసారి బాధ్యతల్లో చేరిన గ్రూప్–1 ఆఫీసర్ బొప్పన అనూషపై పెద్ద బాధ్యతే ఉంది.
పర్యవేక్షణ కరువు
గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం 2024 జనవరి 31న ముగియడంతో ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలోని 471 పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఏ గ్రామంలో చూసినా రోడ్లపైనే మురుగు, చెత్తాచెదారం కనిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక పాలన పట్టుతప్పుతోంది. గ్రామాల ప్రగతిపై తప్పుడు నివేదికలిస్తూ అధికారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రత్యేకాధికారులు తమ శాఖాపరమైన విధులతో పల్లె పాలనపై దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. సర్పంచుల పదవీకాలం పూర్తయి 19 నెలల నుంచి అభివృద్ధికి ఎలాంటి నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి ఆగింది. అటు గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాకర్లకు డీజిల్ కొనేందుకు కూడా చిల్లిగవ్వలేదు. ప్రత్యేక అధికారులు సైతం చేసేదేమీ లేక కార్యదర్శులపై భారం మోపుతున్నారు.
పట్టణాల మాదిరిగానే పల్లెల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 481 గ్రామ పంచాయతీల పరిధిలో 1,282 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు నిర్వహణ లేక కళ తప్పాయి. రూ.కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆహ్లాదం అందని ద్రాక్షగానే మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మొక్కలు లేకుండానే పల్లె ప్రకృతి వనాలు దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో అడపాదడపా మొక్కలు నాటినా సరైన సంరక్షణ చర్యలు చేపట్టక పోవడంతో కనిపించకుండానే పోయాయి. కొన్ని చోట్ల మొక్కలు నాటకుండానే తప్పుడు లెక్కలు నమోదు చేసి బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొద్దిపాటి మొక్కలను మాత్రమే నాటి పల్లె ప్రకృతి వనాల బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక శ్మశానవాటికలను సైతం పట్టించుకునేవారే లేరు. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు చాలా చోట్ల నిర్వాహణ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి దర్శనమిస్తున్నాయి. డంపింగ్‌యార్డుల్లోనూ సేంద్రియ ఎరువుల తయారీ పూర్తిగా అటకెక్కింది. ఇక గ్రామాల్లో కాల్వలు శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్ లీకేజీలు సరిచేయడం లాంటి పనుల కోసం కార్యదర్శులు అప్పులు చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక నిర్వహణ భారంగా మారిందంటున్నారు.


