
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం చండీ హోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకొచ్చారు. అక్కడ మండపారాధన, గణపతిపూజ అనంతరం చండీహోమం గావించి చివరకు పూర్ణాహుతి చేశారు. హోమంలో పాల్గొన్న 21 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కాగా, గురువారాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో ‘జారె’
అశ్వారావుపేటరూరల్ : విద్య – ఆరోగ్యంపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే ఒకరికే అవకాశం దక్కడం విశేషం. ఈ మేరకు తొలిరోజు సదస్సులో ఆరోగ్య అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి వివరించారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
భారీగా గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్ : ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. సీఐ సీహెచ్ శ్రీనివాస్ కథన ప్రకారం.. కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వాహనాలను ఆపి తనిఖీ చేయగా 8.85 కిలోల గంజాయి లభించింది. వారిని విచారించగా హైదరాబాద్‌కు చెందిన ముడావత్ మోహన్ నాయక్, గంట పవన్‌కుమార్, రమావత్ గణేష్, అయ్యప్ప నాయక్, ఆకుల దర్శత్ చంద్రాలు గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించామని, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.
టేకులపల్లిలో 4 కిలోలు..
టేకులపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తుండగా టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. సీఐ టి.సురేష్, ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా ఏఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దుంప ప్రసాద్ జల్సాలకు అలవాటు గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా వెంకట్యాతండా వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, 4.130 కిలోల గంజాయితో పాటు ఆటో, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి విలువ రూ.2.06 లక్షలు ఉంటుందని తెలిపారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం

పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం