
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
దమ్మపేట: వివాహం జరిగి ఏడాది కూడా నిండకముందే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గండుగులపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన కుంట ఏడుకొండలుకు ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన యతిరాజు కృప (19)కు ఎనిమిది నెలల కిందట పెళ్లి అయింది. కొంతకాలంగా ఏడుకొండులు తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడమే కాకుండా వేరే మహిళతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన కృప.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వీరకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
బూర్గంపాడు: గత నెల 26వ తేదీన పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సందెళ్లరామాపురం గ్రామానికి చెందిన కారం సందీప్ (16) జూన్ 26వ తేదీన ఇంట్లో పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే, పదో తరగతి పూర్తిచేసిన సందీప్‌ను పైచదువులు చదువుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో అది ఇష్టం లేని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాలయంలో చోరీ
మణుగూరుటౌన్: స్థానిక పీవీకాలనీలోని రామాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. రోజూమాదిరిగానే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన ఆలయ పూజారి బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసే సరికి హుండీ పగులగొట్టినట్లు గుర్తించాడు. రూ.2 వేల వరకు హుండీలో భక్తుల కానుకలు ఉండొచ్చని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.