
సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో సైన్స్ ఎక్స్‌పో
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం సైన్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ ఎస్‌ఐటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డి.కాశీనాథ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవ జీవన గమనంలో ప్రతి దశలో సైన్స్ అంతర్భాగమన్నారు. సైన్స్ లేకపోతే జీవితమే లేదని, సైన్స్, సమాజం రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వేప, పసుపు వంటి సంప్రదాయ ఔషధాల ఉపయోగాల గురించి, జన్యుపరమైన కేన్సర్‌ను గుర్తించే నానో టెక్నాలజీ అప్లికేషన్స్ ఆవశ్యకతను వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయులు నిరంతర అన్వేషకులని తెలిపారు. మరో గౌరవ అతిథి జీకే కిరణ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద కూడా మాట్లాడారు. వివిధ విద్యాసంస్థల నుంచి 55 మంది విద్యార్థినులు సైన్స్ ప్రాజెక్టు ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. మొదట కార్యక్రమ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి.శైలజ కార్యక్రమ నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో కె.శ్రీలత, డాక్టర్ సీహెచ్ పావని, ఎం.పుష్పలత, కె.స్వర్ణలత, బి.సరోజ, డాక్టర్ కె.రాజ్యలక్ష్మి, షాషేదా పర్వీన్, కె.ఉషారాణి, వి.రేణుక, వి.శ్రీలత, జె.రోజా, ఎస్.ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు.