
కేబినెట్ ఆమోదిస్తేనే..
విలీనం జరిగితేనే..
పురుషోత్తపట్నంలో ఉన్న 889 ఎకరాలు తెలంగాణ దేవాదాయ శాఖకు స్వాధీనం చేస్తే.. దేవస్థానం అవసరాలకు తగ్గట్టుగా పంటలు సాగు చేసే అవకాశం స్థానిక రైతులకే ఇస్తామని ఆలయ అధికారులు ఇప్పటికే హామీ ఇచ్చారు. అయినా ఆ భూములు అప్పగించే అంశంపై ఏపీ సర్కారు నుంచి కనీస మద్దతు లేదు. పైగా ‘తెలంగాణ వారికి మా భూములతో సంబంధం ఏంట’నే ప్రశ్నలు సంధిస్తూ అధికారులపై దాడులకు దిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటికై నా దేవస్థానంతో పాటు భద్రాచలంపై ఆధారపడే స్థానిక గిరిజనుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఆలయ భూములు స్వాధీనం చేసుకునే అంశంలోనైనా ఏపీ ప్రభుత్వంపై నలువైపులా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సుమారు 900 ఎకరాల భూమి ఉంది. ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని ఈ భూముల్లో కొంత భాగమే దేవస్థానం ఆఽధీనంలో ఉండగా, అత్యధిక భూమిని ఏపీకి చెందిన స్థానిక రైతులు ఆక్రమించుకున్నారు. ఆలయ భూముల్లో విఽవిధ పంటలతో పాటు జామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ భూములు తమవేనని స్థానిక రైతులు.. కాదు దేవస్థానానివేనని ఆలయ వర్గాల నడుమ కొన్నేళ్లుగా వివాదం నడిచింది. చివరకు ఈ భూములు ఆలయానికి చెందినవేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీంతో భూముల స్వాధీనానికి ప్రయత్నించిన ప్రతీసారి ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. ఈ క్రమంలో ఆలయ భూముల్లో జరుగుతున్న నిర్మాణ పనులు అడ్డుకునేందుకు మంగళవారం వెళ్లిన ఈఓ రమాదేవిపై అక్కడి రైతులు దాడి చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య నానుతున్న ఈ సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది.
డిమాండ్లకే పరిమితం..
రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీని తెలంగాణలో ఉంచగా పట్టణ శివారులో ఉన్న గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. దీంతో టెంపుల్ టౌన్‌గా ఉన్న భద్రాచలం పట్టణానికి స్థల సమస్య ఏర్పడింది. భద్రాచలం ఆలయ భూములతో పాటు ఇక్కడున్న స్థలాల కొరత సమస్యను అధిగమించేందుకు ఏపీలో ఉన్న యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామపంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలనే డిమాండ్ తరచుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వీలు చిక్కినప్పుడల్లా భద్రాచలం సమీపంలో ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీ బలరాంనాయక్ అయితే ఏపీలో కలిసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వ విధానమేంటి ?
ఏపీలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలనే అంశంపై ఏపీ, కేంద్ర ప్రభుత్వాలతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై రాష్ట్ర సర్కారు తరఫున 11 ఏళ్లుగా కచ్చితమైన రోడ్‌మ్యాప్ కరువైంది. భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపడం, అసెంబ్లీలో వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకుని విలీనానికి అనుకూలంగా తీర్మానం చేయడం వంటి పనులపై ఇప్పటి వరకు కనీస చర్చ జరగలేదు. శ్రీరామనవమి ఏర్పాట్లు, గోదావరి వరదల సమీక్ష, ఆలయ భూముల వివాదం వంటి సందర్భాల్లోనే సరిహద్దు గ్రామాల విలీనంపై ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు తప్పితే ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనే స్పష్టత కరువైంది.
రామాలయ భూముల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌లోనే
భూముల అప్పగింతకు చొరవ చూపని ఏపీ ప్రభుత్వం
భద్రాచలం చుట్టూ ఏపీకి చెందిన ప్రాంతమే..
ఐదు పంచాయతీల విలీనమే భూ సమస్యకు పరిష్కారం
ఈ అంశంపై కొరవడిన తెలంగాణ సర్కారు కార్యాచరణ

కేబినెట్ ఆమోదిస్తేనే..