
ఆధార్ సవరణకు పోటెత్తారు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆధార్‌కార్డులో సవరణలు ఉంటే బుధ, గురువారాల్లో కలెక్టరేట్‌లో నిర్వహించే మెగా ఆధార్ క్యాంపునకు రావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో 21 ఆధార్ సవరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మెగా ఆధార్ క్యాంపునకు అధికారులు ఊహించని స్పందన లభించింది. బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో సహా వేల సంఖ్యలో ఐడీఓసీకి చేరుకున్నారు. వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. వేల సంఖ్యలో ప్రజలు హాజరు కాగా, వందల సంఖ్యలోనే లోపలికి అనుమతించడంతో బయట ఉన్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పనులు మానుకుని వచ్చామని, ఇప్పుడు లోనికి పంపించకపోవడమేంటని నిలదీశారు. భారీగా వచ్చిన ప్రజల నుంచి నిరసన స్వరం వెల్లువెత్తడంతో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, ప్రతీ మండలంలో ఆధార్ సవరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రకటించారు.
17 వరకు మండలాల వారీగా..
కలెక్టరేట్‌లో నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపునకు విశేష స్పందన లభించిందని, ఈ నేపథ్యంలో ఈనెల 17 వరకు మండలాల వారీగా క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించామని అదనపు కలెక్టర్ వెల్లడించారు. 10, 11వ తేదీల్లో కలెక్టరేట్‌లో కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, చండ్రుగొండ, మండలాల వారికి శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. 14, 15, 16 తేదీల్లో భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో భద్రాచలం, బూర్గంపాడు చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల వారికి క్యాంపులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే 15, 16, 17 తేదీల్లో దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల వారికి, మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల వారికి ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతీ కేంద్రంలో అవసరానికి తగినన్ని ఆధార్ కిట్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు వేగవంతంగా సేవలందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆధార్ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యూఐడీఐ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ సౌభన్, జిల్లా ఇ– డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఊహించని స్పందనతో
అధికారుల ఉక్కిరిబిక్కిరి
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడిన ప్రజలు
రేపు రమ్మంటే తిరిగి వెళ్తున్నాం
అధిక సంఖ్యలో జనం రావడంతో లోపలికి అనుమతించలేదు. మా బాబు రోహన్‌రుషికి ఆధార్‌కార్డు చేయిద్దామని వచ్చాను. మళ్లీ రేపు రమ్మని అధికారులు చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నాం.
– బోడా బాబులాల్, పాపకొల్లు,
జూలూరుపాడు మండలం

ఆధార్ సవరణకు పోటెత్తారు..

ఆధార్ సవరణకు పోటెత్తారు..