
ఆర్టీసీకి సమ్మె పోటు
చుంచుపల్లి : కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమ్మె ఆర్టీసీలో విజయవంతంమైంది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న కార్మికులు ఉదయం నుంచే విధులు బహిష్కరించి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో జిల్లాలో పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు నడిచాయి. భద్రాచలం డిపోలో మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. అక్కడ దాదాపు 70 శాతం సర్వీసులు పూర్తి స్థాయిలో రోడ్డెక్కాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల్లో 10 శాతం బస్సులు మాత్రమే తిప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు ఉదయమే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. అద్దె బస్సుల యజమానులు సైతం పూర్తిస్థాయిలో సమ్మెకు మద్దతు తెలిపారు. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్, ఖమ్మం, ఇల్లెందు, వరంగల్, గోదావరిఖని, మణుగూరు, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇక ఏపీకి చెందిన బస్సు సర్వీసులకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగలేదు. సమ్మెతో నాలుగు డిపోల పరిధిలో దాదాపు రూ.22 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీకి సమ్మె పోటు