
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
టేకులపల్లి : టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యమని వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్.వి.వేణుగోపాలచారి అన్నారు. బొమ్మనపల్లి, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి సెక్షన్ల వినియోగదారులకు బొమ్మనపల్లి సబ్ స్టేషన్ ఆవరణలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌లో సమస్యలు పెండింగ్‌లో లేవని చెప్పారు. రహదారుల వెంట, పొలాల్లో, జన సమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో లూజు వైర్లు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కాపర్లు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సత్వరమే పరిష్కరించారు.
బాధితుడికి రూ.80 వేల చెక్కు పంపిణీ..
ములకపల్లి మండలం మాధారాం పంచాయతీ రామాంజనేయపాలెం గ్రామానికి చెందిన వేముల కృష్ణమూర్తికి చెందిన ఆవు గతేడాది ఏప్రిల్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. కాగా, కృష్ణమూర్తి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటినా పరిహారం అందలేదని సదస్సులో వినతిపత్రం అందించగా వెంటనే స్పందించిన ఎస్‌ఈ మహేందర్.. రూ.80 వేల చెక్కును బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో ఫోరం సభ్యులు కె. రమేష్, ఎన్. దేవేందర్, ఎం. రామారావు, డీఈ రంగస్వామి, ఏడీఈ హేమచందర్‌రావు, ఏఈలు దేవా, బుజ్జికన్నయ్య, రాఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాల చారి
పారిశ్రామిక వినియోగదారులకు
మెరుగైన సేవలు..
పాల్వంచ: పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్‌ఈ జి.మహేందర్ అన్నారు. నవభారత్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు సరఫరా వ్యవస్థలో పవర్ ఫ్యాక్టర్ అంశాలు, దాని ప్రభావాలు, మెరుగుదల పద్ధతులు, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, అన్ బ్లాక్ తొలగించడం వంటి వాటిని వివరించారు. కార్యక్రమంలో సింగరేణి, ఐటీసీ, నవభారత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.