
సింగరేణిలో సమ్మె సక్సెస్
● స్వచ్ఛందంగా పాల్గొన్న 80 శాతం మంది కార్మికులు ● నైట్ షిఫ్ట్ కార్మికులతో ఓసీల్లో పని చేయించిన యాజమాన్యం ● యార్డ్‌కోల్‌ను ఉత్పత్తిగా చూపిన అధికారులు
సింగరేణి(కొత్తగూడెం): నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జాతీయ కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సంస్థవ్యాప్తంగా గల 11 ఏరి యాల్లోని గనులు, డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యవసర విభాగాలకు చెందిన 20 శాతం మినహా మిగిలిన 80 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం 18 ఓసీల్లో రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీయాల్సి ఉండగా పూర్తిగా స్తంభించినట్టు సమాచారం. కాగా, యాజమాన్యం మంగళవారం రాత్రి షిఫ్ట్‌కు హాజరైన కార్మికుల(ఆపరేటర్ల)తో బుధవారం కూడా పనులు చేయించింది. అంతేకాక సమ్మెతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి స్థానంలో వర్షాకాలం దృష్ట్యా నిల్వచేసిన యాడ్‌కోల్‌ను చూపిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమ్మె సందర్భంగా కొత్తగూడెంలో ఐఎఫ్‌టీయూ, జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. హెడ్డాఫీస్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకున్నారు. ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు.