
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
అశ్వాపురం: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలను పరిశీలించి, మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించారు. తరగతి గదిలో కూర్చుని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలు బోర్డుపై రాయించి తెలుగులో అర్థాలు చెప్పేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయం వంటి వాటిపై పిల్లలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలం నేపథ్యంలో వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చందు, వార్డెన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.