సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం | Sakshi
Sakshi News home page

సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Published Tue, Nov 28 2023 12:32 AM

- - Sakshi

● రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి ● బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టాలి ● టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇల్లెందు: రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులను తరమికొట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఇల్లెందులో కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. బొగ్గు గనులకు నిలయమైన ఇల్లెందు ప్రాంతంలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. అంతేకాకుండా సింగరేణి ఉద్యోగుల ఆదాయపన్ను, పెన్షన్‌ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోడు పట్టాల కోసం 13 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే నాలుగు లక్షల మందికి మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారని, ఇందిరమ్మ రాజ్యం రాగానే అర్హులైన ప్రతి గిరిజనుడికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామన్న కేసీఆర్‌ నేటికీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో నాలుగు అమలు చేస్తోందని, మరొకటి త్వరలోనే చేయబోతోందని తెలిపారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్‌ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే బోడు, కొమురారం మండలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇల్లెందు కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.1,100 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశానని తెలిపారు. 35 ఏళ్ల కాలంలో ఇల్లెందు రూపురేఖలు మార్చిన ఘనత తనదేనన్నారు. గ్రామాలకు లింక్‌, ప్రధాన రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణం, పట్టణంలో రూ.120 కోట్లతో పలు పనులు చేపట్టామని తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇప్పటికై నా ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే తనను గెలిపించాలని కోరారు. సభలో ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ అధ్యక్షుడు దీపక్‌ బైజు, ఆదివాసీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్య నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరావు, టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ మల్లెల రామనాథం, తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్‌ ఈసం నర్సింహరావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు దొడ్డా డానియేల్‌, పులి సైదులు, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, జానీ, గోచికొండ శ్రీదేవి పాల్గొన్నారు.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement