16 వాహనాలతో పాటు తారు ప్లాంట్‌ దగ్ధం | Sakshi
Sakshi News home page

16 వాహనాలతో పాటు తారు ప్లాంట్‌ దగ్ధం

Published Tue, Nov 28 2023 12:28 AM

దగ్ధమైన వాహనం - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

చర్ల: రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు పనులకు ఉపయోగిస్తున్న 16 వాహనాలతో పాటు ఒక తారు మిక్సింగ్‌ ప్లాంట్‌ను దగ్ధం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దంతెవాడ జిల్లాలోని బాన్సీ పోలీస్‌స్టేషన్‌ పరిధి దంతెవాడ – బైలడిల్లా మధ్య రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిని నిలిపివేయాలంటూ మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. అయినా భారీ పోలీసు భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ బాన్సీలోని పోలీస్‌స్టేషన్‌కు కిలోమీటర్‌ దూరాన క్యాంపు నిర్మించి తారు మిక్సింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడమే కాక సామగ్రి తీసుకొచ్చే వాహనాలను అక్కడే రాత్రి భద్రపరుస్తున్నారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో క్యాంపు వద్దకు వచ్చిన మావోయిస్టులు వాచ్‌మెన్‌ను తుపాకీలతో బెదిరించి లోనకు వెళ్లి తారు మిక్సింగ్‌ ప్లాంట్‌తో పాటు జేసీబీ, ప్రొక్లెయినర్లు సహా 16 వాహనాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. సుమారు 10 మంది మావోయిస్టులు ఆయుధాలతో రాగా, మిగిలిన సుమారు 100 మంది వద్ద కత్తులు, గొడ్డళ్లు, విల్లంబులు ఉన్నాయని తెలిసింది. మంటలు చెలరేగగానే బాన్సీ పోలీసులు వచ్చేలోగా వాహనాలు కాలిపోగా, సోమవారం ఉదయం ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

రూ.3 కోట్ల నగదు స్వాధీనం

ఖమ్మంరూరల్‌: ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం పరిధి వరంగల్‌ క్రాస్‌రోడ్డులోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంటి నుంచి దాచిన రూ.3కోట్ల నగదును అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందానికి అందిన సమాచారంతో తనిఖీకి వెళ్లగా, వీరిని గమనించిన ఇద్దరు వ్యక్తులు వెనుక గోడ దూకి పరారయ్యారు. దీంతో అధికారులు ఆదాయ పన్నుశాఖకు సమాచారం ఇవ్వగా అధికకారులు వచ్చాక ఇంట్లో ఉన్న మహిళ సమక్షాన సోదాలు చేపట్టారు. ఈమేరకు రూ.3కోట్ల నగదుతో కూడిన మూడు బ్యాగులు లభించగా సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్‌ ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement