‘డిజిటల్‌’ మోసగాళ్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ మోసగాళ్ల అరెస్టు

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

● విశ్రాంత ఉద్యోగిని మోసగించి రూ.26.50 లక్షల నగదు బదిలీ ● విశాఖపట్నంకు చెందిన ముగ్గురు సైబర్‌ నేరస్తులు అరెస్ట్‌ ● రూ.10 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, సిమ్‌కార్డులు, పాస్‌పోర్టులు స్వాధీనం

చీరాల: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి నగదు అపహరించిన కేసులో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ ఎండి మొయిన్‌ తెలిపారు. స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చీరాల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది మార్చి 30న కొత్తపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.మోహనరావుకు సోషల్‌ మీడియా ద్వారా పోలీసులమని చెప్పి అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైందని బెదిరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఖర్చవుతుందని బెదిరించి రూ.26.50 లక్షల నగదును అకౌంట్లలో వేయించుకొని మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు ఉన్నారని, క్లీన్‌ చిట్‌ రావాలంటే నగదు ఇవ్వాలని నమ్మబలికారు. అయితే రోజులు గడుస్తున్నా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఐటీ కోర్‌ సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో టెక్నికల్‌ బృందం సహాయంతో దర్యాప్తును ప్రారంభించారు. టూటౌన్‌ సీఐ శశికుమార్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఖాతాల్లో వేసిన నగదును మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి వేరు వేరు అకౌంట్లకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. టెక్నికల్‌ బృందం సమాచారం మేరకు టూటౌన్‌ సీఐ శశికుమార్‌ నేతృత్వంలో ఒక బృందం విశాఖపట్నం వెళ్లి విచారణ చేపట్టారు. విశాఖపట్నంలో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఏ1 బొందలపు గోవిందు పీఓపీ వర్క్స్‌ చేస్తుండగా అతని వద్ద ఏ2 నాగ ప్రదీప్‌, ఏ3 నీల్‌కుమార్‌లు పనిచేస్తున్నారు. అయితే నాగ ప్రదీప్‌, నీల్‌కుమార్‌లు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకునేందుకు కంబోడియా దేశానికి వెళ్లి అక్కడ స్కామర్ల వద్ద తర్ఫీదు పొందిన తర్వాత ఇండియాకు వచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి సైబర్‌ నేరాలు చేయడం ప్రారంభించారు. నాగప్రదీప్‌ వద్ద రూ.8 లక్షలు, నీల్‌కుమార్‌ వద్ద రూ.2 లక్షలు, గోవిందు అకౌంట్‌కు రూ.14 లక్షలు మొత్తం రూ.26.50 లక్షలు వారి అకౌంట్లుకు డబ్బులు వేయించుకున్నట్లు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకుని ఐటీ కోర్‌ బృందం, చీరాల టూటౌన్‌ పోలీసుల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, సిమ్‌కార్డులు, మెమొరీ కార్డు, పాస్‌పోర్టులు రికవరీ చేశామని డీఎస్పీ ఎండీ మొయిన్‌ చెప్పారు. అలానే ఈ కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది లేదని, ప్రజలు భయభ్రాంతులకు గురై అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్‌ నేరస్తుల ఉచ్చులో చదువుకున్న వారే ఇరుక్కుంటున్నారన్నారు. సైబర్‌ నేరాలకు గురైతే 1930 కు కాల్‌ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కేసు ఛేదించేందుకు కృషి చేసిన టూటౌన్‌ సీఐ ఎ.శశికుమార్‌, ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ కె.మురళి, హెడ్‌కానిస్టేబుల్‌ రాజేష్‌, కానిస్టేబుళ్లు ఎస్‌కే నాగూర్‌, ఎం.శ్రీనివాస్‌, టి.బాలాజీ, సీహెచ్‌ రమేష్‌, ఎస్‌.ఆంజనేయులు, వి.శివకృష్ణ, మహిళా కానిస్టేబుల్‌ శివపార్వతి, హోంగార్డు ఎం.ప్రభాకర్‌, ఐటీ కోర్‌ సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐ నజిమాలను డీఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement