డీఆర్వో గంగాధర్‌గౌడ్
బాపట్ల: ఎయిడ్స్ రహిత సమాజం కోసం బాధ్యతతో కృషి చేద్దామని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం బాపట్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారికి పోషకాహారం అందించాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ అవగాహన కార్యక్రమాలను జిల్లాలో క్షేత్రస్థాయిలో నిర్వహించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.విజయమ్మ, జిల్లా లెప్రసీ, టీబీ అధికారి డాక్టర్ వి.సోమలనాయక్, బి.వి.సాగర్ పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై సోమవారం గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో గీతా జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు శ్రీమద్భగవద్గీత సామూహిక పారాయణం నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు.
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కిరీటం, కర్ణాభరణాలను మంగళగిరికి చెందిన దంపతులు సోమవారం బహూకరించారు. పట్టణానికి చెందిన వెనిగళ్ల ఉమాకాంతం, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.5 లక్షల వ్యయంతో బంగారు పూత పూయించిన మూడు కిరీటాలు, ఆరు కర్ణాభరణాలు ఆలయ అధికారులకు అందజేశారు. ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారికి, అమ్మవారికి వాటిని ధరింపజేసి దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, అర్చకులు నల్లూరి రఘులు శాంతి కల్యాణం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాంతి కల్యాణ మహోత్సవంలో వెనిగళ్ల శివకుమార్, తిరుపతమ్మ దంపతులు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, రేవతి దంపతులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఉన్న భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరంలో గీతాజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సామూహిక భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతా జయంతి రోజున కృష్ణ భగవానుడ్ని తలచుకుంటే స్వామి ఆశీస్సులు ఉంటాయని, అందులో భాగంగా గీతా పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మందిర ప్రతినిధి పాతూరి సుధారాణి, నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, రాధిక, పలువురు సాయిభక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం


