దిత్వాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
ఒడ్డుకు చేరిన బోట్లు, వలలు తీర ప్రాంత గ్రామాలను సందర్శించిన రెవెన్యూ, పోలీసు అధికారులు
చీరాల టౌన్: దిత్వా తుపానును ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామని, భారీ వర్షాలు కురిస్తే తీర ప్రాంత గ్రామాల ప్రజల్ని ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ తెలిపారు. దిత్వా తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది వాడ రేవు తీర ప్రాంతంలో పర్యటించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. దీంతో మత్స్యకారులు వలలు, బోట్లు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాడరేవులో సముద్రం అలల ఉద్ధృతి అధికంగా ఉండటంతో తీర ప్రాంతానికి పర్యాటకులను అనుమతించకుండా రెవెన్యూ, మైరెన్, సివిల్ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీకృష్ణ మాట్లాడుతూ తుపాను తీవ్రత తగ్గేంత వరకు మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, పునరావాసా కేంద్రాలు, ఆహార సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. తమసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. తుపాను తీవ్రత తగ్గేంత వరకు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తీర ప్రాంతానికి పర్యాటకులు రాకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వో శేఖర్, పంచాయతీ సెక్రటరీ, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


