అన్నదాతకు అడుగడుగునా కష్టాలు
చెరుకుపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిశీలకుడు యార్లగడ్డ మదన్‌మోహన్ తెలిపారు. చెరుకుపల్లి మండలంలో రైతులు యంత్రాల ద్వారా కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. కొనుగోలు తీరుపై రైతులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కౌలు రైతులను పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుఫాను దెబ్బకు రైతులు క్షణక్షణం భయాందోళన చెందుతున్నారని తెలిపారు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకోవాలంటే పంట నమోదు, తేమ శాతం, రాళ్ల శాతం అంటూ ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆంక్షలను సడలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆదుకోవాలని మదన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర బిసీ సెల్ కార్యదర్శి పీటా మోహన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా కార్యదర్శి లుక్కా బాపనయ్య పాల్గొన్నారు.


