దిత్వా తుపానుపై అప్రమత్తత అవసరం
బాపట్ల: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్ట్‌రేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మొంథా తుపాను సమయంలో తీసుకున్న జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసుకొని, మండల స్థాయి అధికారిని సూపర్‌వైజర్‌గా నియమించి, ప్రణాళిక ప్రకారం పని చేయాలని ఆయన సూచించారు. ప్రతి శాఖకు అవసరమైన జూమ్ లైసెన్స్‌ను కొనుగోలు చేయాలని, వాటికి సంబంధించి ప్రతిపాదనలను అందజేయాలని అధికారులకు సూచించారు. తుపాను కారణంగా వీచే గాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని, వాటి వివరాలు ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట పాల్గొన్నారు.


