ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్న బాధితురాలు పోలీసు పీజీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తిన అర్జీలు
నగరంపాలెం: ఉద్యోగం పేరుతో తనను మోసగించారని ఓ బాధితురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో పలువురు సమస్యలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తెచ్చారు. ఎస్పీ అర్జీల స్వీకరించి, వారి బాధలను ఆలకించారు. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో జిల్లా ఎస్పీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒకసారి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), మధుసూదనరావు (సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించారు.


