గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు అరెస్ట్
నగరంపాలెం: గంజాయి విక్రయించే ఇద్దరు యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రెండు రోజుల కిందట కాకాని రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్ సిబ్బందితో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ క్రమంలో అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయంలో ఉంటున్న మహంకాళి శివమణికంఠ, నెహ్రూనగర్ ఒకటో వీధికి చెందిన భేటి బద్రినారాయణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారిద్దర్ని అరెస్ట్ చేసి, 1,160 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. స్నేహితులైన ఇద్దరు గంజాయికి బానిసయ్యారు. మార్టూరు క్వారీ వద్ద ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు మంగల్ పాండే అలియాస్ మాము వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. చిన్న ప్యాకెట్లగా తయారుచేసి ఎక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు.


