మోసపోయాం.. న్యాయం చేయండి
పజీఆర్‌ఎస్‌లో కురగల్లు రైతుల వినతిపత్రం 21 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామమైన కురగల్లు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం లిమిటెడ్)లో 72 మంది రైతులు నగదు డిపాజిట్ చేయగా, సహకార సంఘం సీఈఓ రమేష్ నకిలీ డిపాజిట్ బాండ్లను ఇచ్చిన విషయం విధితమే. సొసైటీ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసినా బాధితులకు ఎటువంటి భరోసా లభించకపోవడంతో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు హాజరై వినతిపత్రం అందజేశారు. అధికారులు రైతుల బాధలు విని 21 రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాజధానిలో వున్న ఎకరం, అర ఎకరం పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చామని, అందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను నగదు రూపంలో కురగల్లులోని పీఏసీఎస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని, సీఈఓ రమేష్ రైతులందరితో కలివిడిగా ఉండేవాడని, అతనిపై నమ్మకంతో రూ.లక్ష నుంచి కోటి వరకు 72 మంది రైతులు డిపాజిట్ చేయగా, మొత్తం రూ.12 కోట్లకు సంబంధించి రైతులకు నకిలీ డిపాజిట్ బాండ్లను అందజేశాడని వాపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, పత్రికల్లో వార్తలు రావడంతో రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. ఈ కేసు విషయమై ఎవరినీ పూర్తిగా విచారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు అమ్ముకుని, ఆ వచ్చిన డబ్బు పోగొట్టుకున్న తమ పరిస్థితి ఏంటని వాపోయారు.


