మణప్పరంలో బంగారం మాయంపై ఆందోళన
తాకట్టు బంగారం లెక్క విషయంలో వివాదం మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం
కొల్లూరు: బంగారం చైన్ విషయంలో మణప్పరం మేనేజర్ చేతి వాటం ప్రదర్శించి కాలం గడుపుతున్నాడంటూ ఆ శాఖ వద్ద ఆందోళన చేపట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కొల్లూరు ఎస్సీ ప్రాంతానికి చెందిన యలవర్తి సతీష్, మణప్పరం కొల్లూరు శాఖలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సంబంధిత శాఖ మేనేజర్ మనోజ్ చరణ్ తన తాకట్టు లక్ష్యాన్ని చేరుకునేందుకు రుణం ఇవ్వకుండానే రుణం ఇచ్చినట్లు లెక్కల్లో చూయించాడు. ఈక్రమంలో సంస్థలో ఆడిటింగ్ జరుగనుండటంతో క్యాషియర్ సతీష్‌ను ఏదైన బంగారం వస్తువు తీసుకొస్తే రెండు రోజులు గోల్డ్ లెక్కల్లో చూపించి ఆడిటింగ్ ముగిసిన అనంతరం తిరిగి ఇస్తానని మేనేజర్ కోరడంతో బంగారు గొలుసు తీసుకెళ్లి అందజేశాడు. ఆడిటింగ్ ముగిసిన అనంతరం తిరిగి చైన్‌ను మేనేజర్ తిరిగి ఇచ్చాడు. కొన్ని రోజుల అనంతరం మళ్లీ మేనేజర్ చైన్ తీసుకొస్తే ఫైనల్ ఆడిట్ ముగిసిన అనంతరం తిరిగి ఇస్తాననడంతో క్యాషియర్ సెప్టెంబర్ 25న బంగారు గొలుసు తీసుకువెళ్లి కార్యాలయం బల్లపై ఉంచాడు. సంస్థ పనిపై మేనేజర్ బయటకు వెళ్లిరావాలని కోరడంతో క్యాషియర్ కార్యాలయం బయటకు వచ్చాడు. ఈక్రమంలో టేబుల్‌పై బంగారు గొలుసు ఉంచిన విషయం జ్ఞాపకం వచ్చి సంస్థలోని సిబ్బందికి ఫోన్ చేసి చెప్పడంతో అక్కడ ఎటువంటి బంగారం వస్తువు లేదని బదులిచ్చారు. దీంతో మేనేజర్‌ను అడగడంతో చైన్ మాయం విషయం తనకు సంబంధం లేదని బదులిచ్చాడు. సంస్థలో సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు కోరగా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై అప్పట్లోనే కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ హెడ్ క్వార్టర్ నుంచి సీసీ ఫుటేజ్ సేకరణకు అనుమతి రావాలని రెండు నెలల నుంచి మేనేజర్ కాలం గడుపుకొస్తుండటంతో క్యాషియర్ సంబంధువులు ఆందోళనకు దిగారు. మణప్పరం సంస్థ తెరిచే సమయానికి అక్కడకు చేరుకొని ఆ శాఖ తాళాలు తీయనీయకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీసులు ఆందోళన విరమింపజేసి బంగారం మాయం విషయంపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కొల్లూరు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.


