గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీసీఓ
నూజెండ్ల: నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి సోమవారం తనిఖీ చేశారు. ‘కుక్కలు తిన్నాకే తినాలా’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీపీ మేడం జయరామిరెడ్డి, ఎంఈఓలు సత్యనారాయణ, రవిచంద్ర, ఎంపీడీఓ ఉమాదేవిలు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి ప్రహరీ పడిపోయి ఉండటం గమనించి రెండు సంవత్సరాలైనా నిధులు కేటాయించలేకపోయారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆమె ఉన్నప్పుడే 30 పైగా శునకాలు ఆవరణలో తిరుగుతుండటం విశేషం. ప్రిన్సిపల్ రమణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని విచారించారు. కుక్కలు ఆహారాన్ని తింటుంటే చూస్తూ ఉంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం చికెన్ పెడుతున్నారా అంటూ విద్యార్థులను ఆరా తీశారు. ప్రిన్సిపల్ స్థానికంగా ఉండాల్సిందేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నామని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.


