గ్రానైట్ సీనరేజ్ అక్రమ వసూళ్లు ఉపసంహరించుకోవాలి
అద్దంకి రూరల్: చంద్రబాబు సర్కార్ గ్రానైట్ సీనరీజ్ అక్రమ వసూళ్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదంటే పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ సిద్ధమని వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం అద్దంకిలో విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నాణ్యత కలిగిన రాయికి క్యూబిక్ మీటర్‌కు రూ.27 వేలు సీనరీజ్ చెల్లించగా, ఎన్నికల ముందు పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఒంగోలులో సీనరేజ్ రాయల్టీ.. జగన్ మైనింగ్ కంపెనీకి చెల్లిస్తున్నారంటూ ఆరోపించారన్నారు. తాము అధికారంలోకి వస్తే సీనరేజ్ రాయల్టీని పూర్తిగా తగ్గిస్తామంటూ ప్రకటించిన వీడియోను రిలీజ్ చేశారు. నేడు తగ్గించకపోగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు సీనరేజ్ రాయల్టీ రూ.35 వేల పెంపుతో పాటు జీఎస్టీ మరో రూ.35 వేలు కలిపి నారా, కొణిదెల ట్యాక్స్ వసూళ్లు చేసే బాధ్యత ఏఎంఆర్ సంస్థకు అప్పగించారన్నారు. ఏఎంఆర్ సంస్థ నెలకు రూ. 47 వేల కోట్ల చెల్లింపుతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుని బల్లికురవ, అద్దంకి, మార్టూరు ప్రాంతాల్లో 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఈ చెక్ పోస్టులతో కనీసం దేవాలయాలకు, ఇంటి నిర్మాణాలకు సైతం మట్టి, వేస్టు రాయి సైతం తోలుకోలేకపోతున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాలో సీనరీజ్ చెల్లింపునకు ఇక్కడ సీనరేజ్ చెల్లింపుకు భారీ వ్యత్యాసం ఉందని అశోక్‌కుమార్ వివరించారు. గ్రానైట్ పరిశ్రమల్లో రెండు సంవత్సరాలుగా ఎగుమతులు లేక విద్యుత్ బిల్లుల పెంపుతో పరిశ్రమల నిర్వాహకులు కుదేలు అవుతున్నారని.. ఈ పరిస్థితుల్లో సీనరేజ్ రెట్టింపు పెంపుతో రోడ్డెక్కక తప్పటంలేదని తెలిపారు. నాణ్యత కలిగిన రాళ్లకు పాత పద్ధతిలోనే సీనరేజ్ వసూళ్లు చేపట్టాలని వృథా రాళ్లకు సీనరేజ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ అశోక్‌కుమార్


