రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
చెరుకుపల్లి: తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లెందుకు చెరుకుపల్లి నుంచి తెనాలి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా ఆటోను మరో వాహనం ఢీకొట్టటంతో నలుగురికి గాయాలైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినయాశ్రమం గ్రామానికి చెందిన కుంచల శివారెడ్డి అతడి భార్య వెంకటేశ్వరమ్మ, కుమారుడు కునాల్‌రెడ్డితోపాటు పిట్టు వెంకటరెడ్డి, పిట్టు సాంబ్రాజ్యంతోపాటు ఆటో డ్రైవర్ బూసిరెడ్డి ఆదివారం తిరుపతి వెళ్లేందుకు తెనాలికి ఆటోలో బయలుదేరారు. చెరుకుపల్లి శివారులోని టింబర్ డిపో సమీపంలో బ్రాయిలర్ కోళ్ల లోడుతో వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిలో శివారెడ్డి అతడి భార్య వెంకటేశ్వరమ్మ, బూసిరెడ్డిలను పొన్నూరులోని హాస్పిటల్‌కు, కునాల్‌రెడ్డిని తెనాలి ఏరియా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


