కంటిమీద కునుకు కరువు | - | Sakshi
Sakshi News home page

కంటిమీద కునుకు కరువు

Dec 1 2025 8:43 AM | Updated on Dec 1 2025 8:43 AM

కంటిమ

కంటిమీద కునుకు కరువు

కంటిమీద కునుకు కరువు కొల్లూరు: దిత్వా తుఫాన్‌ ముసురుకొస్తున్న తరుణంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తుండటంతో రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలో ఇప్పటికే వరి కోతలు ఊపందుకున్న తరుణంలో తుఫాన్‌ కారణంగా పంట నష్టపోతామన్న ఆందోళన రైతాంగాన్ని వెన్నాడుతోంది. మోంథా తుపాను తాకిడికి ఏర్పడిన పంట నష్టం మరవకముందే నెల రోజుల వ్యవధిలోనే దిత్వా రూపంలో మరో విపత్తు ముంచుకొస్తుండటంతో పంట నష్టం వాటిల్లకుండా రైతులు పంటను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే యంత్రాల ద్వారా కోతలు పూర్తవడంతో ధాన్యాన్ని రహదారులు, ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టుకున్న కర్షకులు పంట తడవకుండా కాపాడుకోవడానికి శతవిధాలా పోరాడుతున్నారు. ఇప్పటికే ఆరుదలకు వచ్చిన ధాన్యం తుఫాన్‌, చలి గాలలు కారణంగా తిరిగి తేమశాతం పెరిగి రంగు మారిపోతుందన్న ఆందోళనకు గురవుతున్న రైతులు పంట దెబ్బతినకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేయడంలో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వం టార్ఫాలిన్‌లు సైతం అందజేయకపోవడంతో తమకు అందుబాటులో ఉన్న పరదాలు, అద్దెకు తెచ్చుకుని వాటితో ధాన్యాన్ని రాశులుగా చేసి కప్పుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు ఓదెలపై ఉన్న వరి పంటను కట్టలు కట్టి కుప్పలు వేసుకుని పంటను కాపాడుకునే పనిలో మునిగి తేలుతున్నారు. తుఫాన్‌ ప్రభావం కారణంగా వర్షంతో కూడిన గాలి తీవ్రత అధికమైతే పంట నష్టం తీవ్రంగా ఉంటుందన్న ఆవేదన రైతాంగంలో వ్యక్తమవుతుంది.

నేల వాలిన వరి

భట్టిప్రోలు: దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మండలంలో శనివారం సాయంత్రం నుంచి ముసురు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల వరి చేలు నేలవాలాయి. పలువురు రైతులు యంత్రాల ద్వారా కోత కోసినా.. ధాన్యాన్ని భద్రపరచేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఓదెలపై ఉన్న పంట వర్షపు నీటిలో తడిస్తే గింజలు మొలకెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓదె దశలో ఉన్న పంటను తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు హడావుడిగా కుప్పలు వేశారు. ఆరబెట్టలేని పరిస్థితి లేకపోవడంతో కుప్పలు వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం వాతావణ పరిస్థితుల దృష్ట్యా వరి కోతలు కోసి కుప్పలు వేసినానష్టం వాటిల్లదని మండల వ్యవసాయ అధికారి బి.బ్రహ్మారెడ్డి తెలిపారు.

అన్నదాతను భయపెడుతున్న ‘దిత్వా’ తుఫాన్‌

విత్తు వేసేటప్పుడు చినుకు కోసం ఆశగా ఆకాశం వైపు చూసే అన్నదాత.. నేడు అదే ఆకాశం వైపు భయం.. భయంగా చూడాల్సిన దుస్థితి. పంట చేతికొచ్చే సమయానికి దూసుకొచ్చే తుఫాన్‌ల దెబ్బకు రైతులు హతాశులవుతున్నారు.. ఇప్పటికే ‘మోంథా’ తీవ్రంగా ముంచే యగా.. ఉన్న పంటనైనా కాపాడుకుందామన్న అన్నదాతలను ‘దిత్వా’ భయపెడుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీసం పట్టలు ఇచ్చేవారు కరువై.. రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు.

తుఫాన్‌ ప్రభావంతో

చిరుజల్లులతో కూడిన వర్షం

రహదారుల పైనే ధాన్యం రాశులు

కాపాడుకునేందుకు పడరాని పాట్లు

హడావిడిగా కుప్పలు

వేసుకుంటున్న రైతులు

టార్ఫాలిన్‌లు సైతం ఇవ్వని ప్రభుత్వం

కంటిమీద కునుకు కరువు 1
1/3

కంటిమీద కునుకు కరువు

కంటిమీద కునుకు కరువు 2
2/3

కంటిమీద కునుకు కరువు

కంటిమీద కునుకు కరువు 3
3/3

కంటిమీద కునుకు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement