అధికారులు అప్రమత్తంగా ఉండాలి
బాపట్లటౌన్: దిత్వా తుఫాన్ నష్టాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగమంతా సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దిత్వా తుఫాన్ హెచ్చరికతో ముందస్తు జాగ్రత్త చర్యలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆదివారం కలెక్టరేట్‌లో మంత్రి సమీక్షించారు. గత తుఫాన్ అనుభవాలతో మరింత సమర్థంగా, అధికారులు పని చేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో అద్దంకి, చినగంజాం మండలాలకు హై అలర్ట్ ఉందన్నారు. జిల్లాలో తీర ప్రాంతం అధికంగా ఉన్నందున ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, బోట్లు అన్ని తీరానికి వచ్చాయా లేదా పునఃపరిశీలన చేయాలన్నారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లనీయరాదన్నారు. ధాన్యం పండించిన ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 1,500 టన్నుల ధాన్యం సేకరించాలన్నారు. గోనె సంచుల కొరత లేకుండా చూడాలన్నారు.
● దిత్వా తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాపై కొంతమేర చూపనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అద్దంకి, చిన్నగంజాం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైఅలర్ట్ వచ్చిందన్నారు. ఆ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు. ధాన్యం కోత జరిగితే, దాచి పెట్టడానికి 150 ప్రాంతాలలో గోదాములు సిద్ధం చేశామన్నారు.
● దిత్వా తుపానుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రావు తెలిపారు. ఐదు మండలాలపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి వచ్చేసినట్లు సమాచారం అందిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్ధంగా నడుస్తున్నాయని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట చెప్పారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తుఫాన్ నేపథ్యంలో
మంత్రి కొలుసు పార్ధసారధి సమీక్ష


