ఘనంగా లయోలా వజ్రోత్సవాలు
గుంటూరు రూరల్: విద్యద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, అటువంటి విద్యను అందిస్తున్న లయోలా స్కూల్స్ సమాజాభివృద్ధికి తమదైన ముద్రను వేస్తున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో లయోలా డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్ళ లయోలా విద్యాప్రస్థానంలో ఎందరో ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను, సమాజ సేవకులను, కార్పొరేట్ దిగ్గజాలను అందించిందన్నారు. ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటంలో లయోలా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. విద్య, క్రీడలు, సాంకేతిక నైపుణ్యం అన్ని రంగాల్లో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించిన లయోలా అభినందనీయమన్నారు. లయోలా డైమండ్ జూబ్లీ వేడుకల సావనీర్‌ను విడుదల చేశారు. పూర్వ ప్రిన్సిపల్స్, యాజమాన్యాన్ని సన్మానించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఏఎంఆర్ ఇండియా సంస్థ చైర్మన్ ఎ.మహే ష్‌కుమార్‌రెడ్డి, పాఠశాల సుపీరియర్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాథర్ డాక్టర్ పి.ఆంథోని, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సహాయరాజ్ మార్క్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ భాగ్యయ్య, రెవరెండ్ పాథర్ డాక్టర్ కెఎ స్టానిస్‌లూయిస్, పాఠశాల వైస్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా లయోలా వజ్రోత్సవాలు


