వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్
నగరం: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైద్య విద్య ప్రైవేటీకరణతో పేదలు నష్టపోతారని వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఈవూరి గణేష్ పేర్కొన్నారు. మండలంలోని పూడివాడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారన్నారు. ఇప్పడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని 7 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలకు వైద్య సేవలను దూరం చేస్తోందన్నారు. అయినవారికి దోచిపెట్టడానికి కుట్రలో భాగంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం తీరును మార్చుకుని కళాశాలల నిర్మాణం, నిర్వహణ బాధ్యత చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇంకోల్లు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పాగోలు వెంకటేశ్వర రావు, బాలకృష్ణ, నాయకులు పృథ్వీ, జాలాది సునీల్, పోలిరెడ్డి, రవీంద్ర, సుబ్బారావు, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రసన్న తేజ, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.


