నాసిరకం స్ప్రేయర్లు అంటగట్టి మోసం
జె.పంగులూరు: తమ కంపెనీ ఇచ్చే తైవాన్ స్ప్రేయర్లు నాణ్యమైనవని, చాలాకాలం మన్నికగా పనిచేస్తాయని, ధర కూడా తక్కువగా ఉంటాయని రైతులను నమ్మబలికి నాసిరకం అంటగట్టారు. అటు తరువాత రైతులకు కనబడకుండా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా జై కిసాన్ ఆగ్రో పోడక్ట్స్ కంపెనీ వారు మోసం చేశారని రైతులు వాపోతున్నారు. రైతులకు నాణ్యమైన పట్టలు ఇస్తామని ఒక్కో పట్టకు రూ. 6 వేల చొప్పున ముందుగానే డబ్బు తీసుకొని ఉడాయించారని పేర్కొన్నారు. మండలంలోని అలవలపాడు గ్రామంలో సదరు కంపెనీ ప్రతినిధులు ఆరుగురు రైతుల వద్ద రూ.1,56,000 దోచుకొని వెళ్లిపోయారు. ఒక్కో తైవాన్ స్ప్రేయర్ రూ. 14 వేల చొప్పున రూ. 84 వేలు తీసుకొని నాశి రకానివి ఇవ్వడం వల్ల సరిగా పనిచేయడం లేదని రైతులు తెలిపారు. వీరి వద్దే ఒక్కో పట్టకు రూ. 6 వేల చొప్పున అందరి నుంచి రూ. 72 వేలు తీసుకున్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు రైతులకు పట్టలు ఇవ్వలేదు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ప్రకారం కంపెనీ మేనేజర్‌కు, టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని వాపోయారు. కంపెనీ వారు ఎక్కడ ఉన్నారో, వారిని ఎలా పట్టుకోవాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు పంటలు సక్రమంగా పండక.. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇలా కంపెనీల వారు మోసం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నిందితులను శిక్షించాలని రైతులు, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు డిమాండ్ చేశారు.


