జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక
వేటపాలెం: అంతర్ జిల్లాల ఫెన్సిలింగ్ పోటీలకు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకపోతుల యతిన్ శ్రీ కార్తికేయ ఎంపికై నట్లు హెచ్‌ఎం దీప్తి శుక్రవారం తెలిపారు. కొనసీమ జిల్లాలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో కార్తికేయ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్‌లో జరగనున్న ఎస్‌జీఎఫ్ నేషనల్ ఫెన్సింగ్ టీం ఈవెంట్‌కు రాష్ట్రం తరఫున అడనున్నాడని తెలిపారు. విద్యార్థిని కోచ్ చిరంజీవి, పీడీ నాగేశ్వరరవు, పీడీ వెంకటేశ్వర్లు, సెక్రటరీ బి. మోహన్‌రావు అభినందించారు.
కొత్త గోరంట్ల దేవాలయంలో చోరీ
సత్తెనపల్లి: దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం కొత్త గోరంట్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోరంట్ల గ్రామంలోని శివారున పొలాల సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానంలో గుర్తు తెలియని దుండగులు తలుపు పగలగొట్టి రెండు పంచలోహ విగ్రహాలను, రూ.10 వేల నగదు అపహరించుకుపోయారు. ప్రతి శుక్రవారం, ఆదివారం దేవాలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన నంబూరు ఏడుకొండలు తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపల పరిశీలించాడు. రెండు పంచలోహ విగ్రహాలు, రూ.10 వేలు నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి
రేపల్లె: ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. తోమాటి సామ్రాజ్యం (80) రుద్రవరం వద్ద పండ్లు అమ్ముకుంటూ రహదారిపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో శుక్రవారం ఢీకొంది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక


