24 గంటలు అందుబాటులో ఉంటాం
గుంటూరు మెడికల్: ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్‌బాబు చెప్పారు. శుక్రవారం గుంటూరు కన్నావారితోట 4వ లైనులో ఏపీజీడీఏ సెంట్రల్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ ఈఎన్‌టీ రిటైర్డ్ హెచ్‌ఓడీ డాక్టర్ మహేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని, కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయధీర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక పదేళ్ల అనంతరం గుంటూరులో సంఘ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. వైద్యుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని వివరించారు.
● ముఖ్య అతిథి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ జయధీర్ వైద్యుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని తెలిపారు. వైద్యుల సమస్యలపై పోరాటానికి తమ జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రమేష్‌కుమార్, కోశాధికారి డాక్టర్ పి.జె.శ్రీనివాస్, పలు జిల్లాలకు చెందిన నేతలు, గుంటూరు జిల్లా నేతలు పాల్గొన్నారు.


