మెరుగైన వైద్య సేవలందించాలి
కర్లపాలెం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య జిల్లా డేటా మేనేజర్ ఎన్.లక్ష్మణ్ చెప్పారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ టాస్క్‌ఫోర్స్ బృందం పెదపులుగువారిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామస్తులకు అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై పౌష్టికాహార ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. గ్రామంలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వారికి అందుతున్న వైద్య సేవలను ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డేటా సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మల్లికార్జున్, సీహెచ్‌వో స్వరూపారాణి, ఏఎన్‌ఎం తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బల్లికురవ: అగ్రహారం భూములు సాగు చేస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చేయూతనిచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం చెన్నుపల్లి, అంబడిపూడి, మల్లాయపాలెం, కొప్పరపాలెం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తులు డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోగా రాజాగారితోట, గుంటూరులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


